ఇంటర్ విద్యను రద్దు చేస్తే కొరివితో తలగోక్కునట్టే..సీఎం ఏకపక్ష నిర్ణయాలు సరికాదు: కవిత 

ఇంటర్ విద్యను రద్దు చేస్తే కొరివితో తలగోక్కునట్టే..సీఎం ఏకపక్ష నిర్ణయాలు సరికాదు: కవిత 
  • ‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్’సదస్సులో టీఆర్ఎస్ చీఫ్ 

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న ఇంటర్ బోర్డును తీసేయడం అంటే కొరివితో తలగొక్కున్నట్టేనని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. ఇంటర్మీడియట్ విద్యను తీసేయాలన్న సీఎం రేవంత్ నిర్ణయాన్ని చూసి తుగ్లక్ కూడా సిగ్గుపడుతాడని విమర్శించారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు మేధావులు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడాలని సూచించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే బెడిసికొడుతాయన్నారు.

శుక్రవారం నాంపల్లిలోని మీడియా అకాడమీలో తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన‘సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్’జంగ్ సైరన్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కవిత హాజరై, మాట్లాడారు. సడన్‌గా ఒక మీటింగ్‌లో ఈ ఏడాది నుంచి ఇంటర్ అడ్మిషన్లు ఉండవని సీఎం అంటారని, రెండు రోజులకే ఇంటర్ బోర్డు అడ్మిషన్ల ప్రక్రియ ఇస్తుందని.. దీనిబట్టి సీఎం మాటకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

సీఎం పదవికి ఉన్న డిగ్నిటీని కాపాడాలని హితవు పలికారు. ఇంటర్ విద్యను కాపాడుకునేందుకు జేఏసీతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఇంజినీరింగ్ విద్య వేస్ట్ అనడం, ఐటీఐ, పాలిటెక్నిక్ తీసేస్తామనడం సరికాదన్నారు. వైట్ కాలర్ జాబ్స్ వదిలేసి బ్లూ కాలర్ జాబ్స్ వెతుక్కోవాలని సూచించడం ఏమిటని ప్రశ్నించారు. విద్యా కమిషన్ పేరుతో సీఎం మూడేండ్లు వృథా చేశారని, మళ్లీ కేకే కమిషన్ పేరుతో మరింత సమయం వృథా చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విలీనం ఆలోచన మానుకోవాలి: మధుసూదన్ రెడ్డి 

రాష్ట్రంలో 1,349 సర్కారు గురుకులాల్లో 82 వేల మంది ఇంటర్ చదువుతున్నారని, కానీ 440 సర్కారు జూనియర్ కాలేజీలో ఫస్టియర్‌‌లో 94 వేల మంది చేరారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం విలీనం చేయాలనుకుంటే ప్రజల నుంచి రెఫరండం కోరుతూ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్​చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ లాంటి బోర్డుల నుంచి ఇంటర్ బోర్డులోకి ఏటా 30 వేల నుంచి 40 వేల మంది చేరుతున్నారని గుర్తుచేశారు. ఏపీలో జగన్‌ను ముంచినట్లుగానే కొందరు మేధావుల సలహాలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కొంప తానే ముంచుకుంటున్నారని విమర్శించారు.

కశ్మీర్ ఎన్‌ఐటీలోనూ 50 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండడానికి ఇక్కడి పటిష్టమైన ఇంటర్ విద్యే కారణమని, అలాంటి వ్యవస్థను స్కూల్ విద్యలో విలీనం చేయడం ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఆలోచన విరమించుకోకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ సదస్సులో జేఏసీ సెక్రటరీ జనరల్ కృష్ణకుమార్, జేఏసీ కో చైర్మన్ కనకచంద్రం, జేఏసీ నేతలు మాధవరావు, బలరాం జాదవ్, రజిత, కవితకిరణ్, లక్ష్మీ, శివకుమార్, యాకుబ్ పాష తదితరులు పాల్గొన్నారు.